Loading

wait a moment

అవును.. కేసీఆర్ కు భయం పట్టుకుంది..!అందుకే అక్కడ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన సీఎం..!!

హైదరాబాద్ : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఐతే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, ఏదన్నా జరగొచ్చు అనే అంశం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ ఎక్క‌డుంది.. అస‌లు ఆ పార్టీ గురించి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు ‘ అని పైకి సవాల్ విసురుతున్న‌ప్ప‌టికీ, లోలోన మాత్రం టీఆర్ఎస్ నేత‌లు బీజేపీని చూసి భ‌య‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండోసారి అధికారం ద‌క్కించుకున్న త‌ర్వాత ఇక రాష్ట్రంలో త‌మ‌కు ఎదురేలేద‌ని గులాబీ నేతలు భావించారు. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి బీజేపీ భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగు పార్ల‌మెంట్ స్థానాల‌ను ద‌క్కించుకుని గులాబీ పార్టీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసింది భారతీయ జనతా పార్టీ.

కరీంనగర్ పై కన్నేసిన కేసీఆర్..! కమలాన్ని కట్టడి చేయాలని కుయుక్తులు..!! అంతేగాక గులాబీ పార్టీకి కంచుకోట‌గా ఉన్న నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ లాంటి చోట్ల కూడా కాషాయ జెండాను ఎగుర‌వేసింది. టీఆర్ఎస్ అడ్డా అయిన ఉత్త‌ర తెలంగాణ‌లో ఏకంగా మూడు ఎంపీ స్థానాలు బీజేపీ ఖాతాలో ప‌డ్డాయ్‌. ఏకంగా ముఖ్య‌మంత్రి కూతురు క‌విత‌ను ఓడించి, గులాబీ పార్టీకి ఊహించ‌ని షాక్ ఇచ్చింది. తాము ఊహించిన‌దానికంటే ఎక్కువ సీట్లు పొంద‌డంతో ఆ పార్టీ ఇక రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ‌లో పాగా వేసేందుకు రెడీ అవుతోంది. ఏకంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా, తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృ ష్టి సారించార‌ని ఆపార్టీ నేత‌లే ప్ర‌క‌టించారు.

కరీంనగర్ లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ..!నిలువరించేందుకు కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు..!! అయితే మొదట బీజేపీ నేత‌ల వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకున్న‌ట్టు కనిపించినా, రానురాను టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తాజా మంత్రి కేటీఆర్ కూడా బీజేపీని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు సైతం బీజేపీ నేత‌ల ఎత్తుగ‌డ‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు సమాచారం. ఈ క్ర‌మంలోనే నిన్న జ‌రిగిన మంత్రివ‌ర్గ కూర్పులో కూడా ఆయ‌న ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్‌కు గుండెకాయ‌లాంటి క‌రీంన‌గ‌ర్‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ట్టు కోల్పోవ‌ద్ద‌ని, ముఖ్యంగా పార్ల‌మెంట్ స‌భ్యుడు బండి సంజ‌య్ దూకుడును అడ్డుకోవాల‌ని సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఒక్క ఎంపీ టార్గెట్‌గా రెండు మంత్రి ప‌ద‌వులు..! బీజేపికి భయపడుతున్న గులాబీ శ్రేణులు..!! ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట్ ప‌రిధిలోని క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌తో పాటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇదే పార్ల‌మెంట్ ప‌రిధిలోని హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఈట‌ల మంత్రివ‌ర్గంలో కొన‌సాగుతుండ‌గా, తాజాగా మ‌రో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఎంపీ బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకు ఆయ‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్రశేఖర్ రావు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

టీఆర్ఎస్ కంచుకోటగా కరీంనగర్..! కానీ ప్రజల్లో అనూహ్య మార్పు..!! కరీం న‌గర్ ఓట‌రు ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇచ్చిన తీర్పు ఎంతో వైవిద్యంగా ఉంది. తేడా వ‌స్తే, తెలంగాణ ప్ర‌జ‌లు ఎవ‌రినైనా అదఃపాతాళానికి తొక్కేస్తారనేందుకు నిద‌ర్శ‌నంగా నిలిచింది కరీంనగర్ లోక్ సభ ఎన్నిక. టీఆర్ఎస్ కంచుకోట‌లో ఓ సామాన్యుడు సంచ‌ల‌న రీతిలో ఎంపీగా గెలిచాడు. అంతెందుకు అదే బండి సంజ‌య్ నాలుగు నెల‌ల క్రితం జ‌రిగిన ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో ఇదే గంగుల క‌మ‌లాక‌ర్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు అదే క‌మ‌లాక‌ర్‌కు చంద్రశేఖర్ రావు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక్క‌డ సంజ‌య్‌తో పాటు బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సంజ‌య్ కు ప్రజా మద్దత్తు పెరగొద్దని, బీజేపీ ఎదిగేందుకు అవకావం ఇవ్వ‌కూడ‌ద‌నే చంద్రశేఖర్ రావు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *