Loading

wait a moment

‘కశ్మీర్’ చిచ్చుకు ఆజ్యంపోసిన ఆ ఒక్క సలహా!

సుందర కశ్మీరంలో ఏదైనా అనూహ్యం జరగబోతోందా? ఏమీ లేకపోతే ఇంత హడావుడి ఎందుకు కనిపిస్తోంది? కశ్మీర్‌తో పాటు దేశమంతటా ప్రజల్లో ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హైలైట్స్
దేశ విభజన తర్వాత దశాబ్దాలుగా కశ్మీర్‌లో కాలుతోన్న రావణకాష్టం.
అదనపు బలగాల తరలింపుతో ఒక్కసారిగా వేడెక్కిన భూతల స్వర్గం.
ఏం జరగబోతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ప్రజానీకం

కశ్మీర్‌‌లో జరుగుతోన్న అనూహ్య పరిణామాలపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370, ప్రత్యేక హక్కులను ఇస్తున్న ఆర్టికల్‌ 35ఏ ని రద్దుచేస్తారని కొందరంటే లేదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటారని మరికొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తంచేస్తున్నారు. దేశ విభజన తర్వాత కశ్మీర్ విషయంలో భారత్, పాక్‌ల మధ్య వివాదం కొనసాగుతూ వస్తోంది. కశ్మీర్ తమకు చెందుతుందని పాక్ వాదిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌ సంస్థానంలో అంతర్భాగంగా ఉండేది. బ్రిటిషర్లు పోతూ పోతూ దేశాన్ని రెండు ముక్కలు చేసి వెళ్లిపోయారు. అప్పటికి భారత్‌లో ఉన్న 540పైగా సంస్థానాల్లో కశ్మీర్ కూడా ఒకటి. స్వాతంత్రం తర్వాత ఒక్క కశ్మీర్, హైదరాబాద్ సంస్థాలు మినహా అన్నీ భారత్‌లో విలీనమయ్యాయి.

కశ్మీర్‌‌లో అప్పటికే రావణకాష్టం రగులుతోంది. అయితే, తాను భారత్, పాక్‌లో విలీనం కాబోమని స్వతంత్రంగా ఉంటానని కశ్మీర్ పాలకుడు రాజా హరిసింగ్ స్పష్టం చేశారు. రెండు దేశాలతోనూ స్నేహ సంబంధాలను కొనసాగించాలని భావించిన హరిసింగ్, భారత్, పాకిస్థాన్‌తో యథాతథ స్థితి ఒప్పందానికి ప్రతిపాదనలు చేశాడు. దీనికి తొలుత పాక్ ఆంగీకరించగా, భారత్ మాత్రం ఓ ప్రతినిధిని చర్చలకు ఢిల్లీ పంపాలని కోరింది. ఇదే సమయంలో 1947 అక్టోబరులో పాకిస్థాన్‌ సైన్యం పష్తూన్‌ గిరిజనులను జమ్మూకశ్మీర్‌పై దాడికి ఉసిగొల్పింది. వారికి ఆయుధాలను అందించి, శ్రీనగర్‌ను ఆక్రమించుకోడానికి పంపింది. పష్తూన్ గిరిజనులు కశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు.

దీంతో రాజా హరిసింగ్ భారత్‌ను సైనిక సాయం కోరారు. ఈ సమయంలో నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మూడు షరతులు విధించారు. సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలన్న షరతుకు రాజా హరిసింగ్ అంగీకరించారు. ఆ తర్వాత కశ్మీర్‌ సంస్థానాన్ని హరిసింగ్‌ భారత యూనియన్‌లో విలీనం చేశారు. అప్పట్నుంచి జమ్మూకశ్మీర్‌ మొత్తంపైనా తమకు పూర్తి హక్కులు దఖలుపడ్డాయని భారతదేశం వాదిస్తోంది. పాకిస్థాన్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. ప్రజాభిప్రాయానికి విరుద్దంగా ఒత్తిడికి తలొగ్గి హరిసింగ్ విలీనానికి అంగీకరించారని, పీవోకే తమదేనంటూనే.. కశ్మీర్‌లోనూ పాగా వేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది.

దాదాపు ఏడు దశాబ్దాలుగా తమ ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని పాకిస్థాన్‌ ‘ఆజాద్‌ కశ్మీర్‌’ అని పిలుస్తుంది. ఇందులో రెండు భాగాలు ఉండగా అవి ఆజాద్‌ కశ్మీర్‌, గిల్గిత్‌- బాల్టిస్థాన్‌. బాల్టిస్థాన్‌లోని షక్సగమ్‌ నుంచి గిల్గిత్‌లోని రుక్సం వరకు ఉన్న భూభాగాన్ని ట్రాన్స్ కారాకోరం మార్గంగా పిలుస్తారు. దీనిని చైనాకు పాకిస్థాన్‌ ధారదత్తం చేసింది. కశ్మీర్‌లోని అక్సాయిచిన్‌ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. తాత్కాలిక రాజ్యాంగ చట్టం ప్రకారం ఆజాదీ కశ్మీర్‌( ఏజేకే) పరిపాలన కొనసాగుతోంది. దీనికి ప్రత్యేక అధ్యక్షుడు, ప్రధాని ఉన్నప్పటికీ వీరికి ఎలాంటి అధికారాలూ లేవు. ప్రతి చిన్న విషయానికీ పాకిస్థాన్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

వాస్తవానికి తిరుగుబాటుదారుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న సమయంలో రాజా హరిసింగ్ మొదట నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్‌ను సంప్రదించారు. ముందు శాంతిభద్రతల సమస్య పరిష్కారం అయ్యాక విలీనం అంశాన్ని ప్రజల అభీష్టానికి అనుగుణంగా చేయవచ్చంటూ బాటన్ సలహా ఇచ్చారు. ఈ సలహానే కశ్మీర్ కొంప ముంచింది. ప్రజాభీష్టం అన్న పదమే కశ్మీర్‌లో చిచ్చుకు ఆజ్యం పోసింది. విలీనం కోసం ప్రజాభిప్రాయ సేకరణకు భారత్ ప్రయత్నించగా, పాక్, వేర్పాటువాదులు దీనిని వ్యతిరేకించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *